“మా వూరు “

పసితనపు మా బుడి బుడి అడుగులకు
లేత ప్రాయపు మా వడి వడి నడకలకు
కౌమారపు మా పదునైన పరుగులకు
ఊతమిచ్చిన మా నేలతల్లి, మా వూరు  కవుతరం!


కీ.శే. నార్ల వెంకటేశ్వరావు గారు (V.R నార్ల. – ప్రముఖ జర్నలిస్టు) వారి స్తుతి:

కన్నతల్లికి సాటి,
అన్నపూర్ణకు మేటి,
ఎన్ని తరములనాటిదో మా ఊరు?
ఎన్ని వరముల తోటిదో!


మాదాసు (కవిరత్న) వారి స్తుతి:

కవుతరం మా వూరు,
కన్నతల్లి వంటి కవుతరం మా వూరు.
మమతకు, మానవతకు చైతన్యానికి,
మారు పేరు మా వూరు.
గౌతమేశ్వరవరం,
రూపాంతరం కవుతరం.
శతసరోవర సమాన్వితం మా వూరు.
నింగిని చుంబించే గాలి గోపురం,
మా వూరు ఉనికికి సంకేతం.
చదువులకు పుట్టిల్లు మా వూరు
స్వాతంత్య్ర సమరయోధుల మెట్టినిల్లు మా వూరు
కన్నతల్లి, పుట్టిన నేల,
పెరిగిన ప్రదేశాలు
స్వర్గానికన్నా మిన్న
అన్నాడొక దేశభక్తుడు.

“కన్నతల్లి వున్న వూరు
నేగి లేదనేది” మా అమ్మ
మా వూరును చూచి
ఉప్పొంగు నా యెద
చంద్రుని చూచిన
సముద్రము లాగున.
నేనీదని చెర్వులేదు
నాతో ఆటలాడని
నేస్తం లేదు మా వూర
చిన్నా పెద్దా భేదం లేదు.

భిన్న భావాలుండవచ్చు
విరోధులు లేరు నాకు
ఆటలవరకే స్పర్థ
అంతరంగం నిర్మలం.

ఆప్యాయతలు అనంతం
అది తోడబుట్టినతనం
లేడితో ఆడే అనుభవం
లేతవయసుల అనుబంధం
కరుణనింపునట్టి కౌతరం మా వూరు
మమత పొంగునట్టి మాతృభూమి
అరమరికలు లేవు అచ్చటివారికి
ఎంత ధన్యతములో ఎంచలేము
కన్నతల్లివంటి కౌతరమున నూర
చెరువులెన్నో గలవు చెన్నుమీర
నీటిబదులు వుండు నిర్మలమగుప్రేమ
అన్నదములవలె అందరుండు.