గౌతమేశ్వర వరప్రసాదితమని చెప్పబడుతున్న యీ కౌతరం గ్రామం భూమధ్య రేఖకు ఉత్తరంగా 16.20 డిగ్రీల అక్షాoశ రేఖ మీదను,
గ్రీన్విచ్ కి తూర్పుగా 81.07 డిగ్రీల రేఖాంశము మీదనుగలదు. కృష్ణాజిల్లా కేంద్ర స్థానమైన మచిలీపట్టణము (బందరు)నకు వాయువ్య దిక్కుగా 11 మైళ్ళు, గుడివాడ తాలూకా కేంద్ర స్థానమైన గుడివాడ పట్టణమునకు ఆగ్నేయ దిక్కుగా 8 1/2 మైళ్ళ దూరమందు వున్నది.

బందరు – తిరువూరు మెటల్ రోడ్డు యీ గ్రామం మధ్యగా పోయింది. అంతేకాక యీ గ్రామం బెజవాడ – బందరు రైల్వే లైను మీద వున్నది. దీనికి “కవుతరం”, “కవుతరంగేటు” అను రెండు రైల్వే స్టేషన్లు వుండేవి. రెంటికి బదులు గ్రామానికి సమీపంలో 1964 లో నూత్న భవనాలతో ఒకే ఒక స్టేషన్ ఏర్పడింది. నలుదిక్కుల పోయిన, పడవలు నడిచే కాలువల కూడలిస్థానం దీని పొలిమేరలో వుంది. దాన్ని “కవుతరం లాకులు” అందురు. కౌతరం సబ్ డివిజన్ (P.W.D), పోలీసులైన్, సబ్ రిజిష్టారు ఆఫీసు, సబ్ ఆఫీసు (పోస్టల్), హైస్కలు, లార్జి స్కెలు కోపరేటివ్ సొసైటీ, జిల్లా లైబ్రరీ అధారిటీ వారి బ్రాంచి లైబ్రరీ యీ గ్రామమందు ఉన్నాయి. ఇది మేజర్ పంచాయితీ గ్రామం. జనాభా 10,000.

ఈ గ్రామం కొత్తపేట, స్కాట్ పేట, లాకు 1వ వార్డు, పద్మాలపాలెం, పసుబొట్లపాలెం, బలరాంపురం అనుశివార్లతో విస్తరిల్లింది.

ఈ గ్రామం ఒక మైలు నిడివి, 2 వేలు ఇళ్ళు, 64 ఎకరములు వైశాల్యము వుండి సుక్షేత్రమైన 185 ఎకరములు మెట్ట, 2575 ఎకరములు మాగాణి భూములు కలిగి సస్యశ్యామలమై, విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఎత్తయిన గోపురం, మేఘాలనంటుతున్న గోపురం, గాలిగోపురం యీ గ్రామానికి మకుటాయమానమై గ్రామపుటౌన్నత్యాన్ని చాటుతున్నట్లున్నది.

కాలానుగుణ్యంగా నూత్నపుంతల త్రొక్కుతున్న – కృష్ణాజిల్లాలోని ముఖ్య గ్రామాలలో ఇది ఒక గ్రామం.